61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఏళ్లకేళ్లుగా నియామకాలకు నోచుకోక తల్లడిల్లిన నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొలువుల పండుగను నిర్వహించి నియామక పత్రాలను అందించారని ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం, మరో 8,632 పోస్టుల నియామకాలు తుది దశలో ఉన్నాయని, వీటితో కలిపితే మొత్తం నియామకాల సంఖ్య 70,011కు చేరిందని పేర్కొంది. విద్యా, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయడమే కాక, యువత నష్టపోకుండా నియామకాల వయో పరిమితిని సడలించిందని గుర్తు చేసింది. గతంలో గందరగోళమైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,067, మెడికల్ అండ్ హెల్త్ బోర్డు ద్వారా 8,666, డీఎస్సీ ద్వారా 10,006 పోస్టులతో సహా వివిధ విభాగాల్లో నియామకాలు పూర్తి చేసి నిరుద్యోగుల పట్ల తమ నిబద్ధతను చాటుకుందని ప్రభుత్వం వెల్లడించింది.

