NewsTelangana

తెలంగాణాలో కొత్తగా 6 లక్షల ఓటర్లు

తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో కొత్త ఓటర్లు కూడా భారీగా పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో ముందుగానే ఓటరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. 17 ఏళ్లు దాటిన వారందరూ ఓటరుగా అడ్వాన్స్‌డ్‌గా నమోదయ్యేందుకు అవకాశం లభించడంతో.. తెలంగాణలో కొత్తగా 6 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు కోసం జనవరి 1 వరకు వేచి ఉండకుండా నవంబర్ 9 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ఈసీ అవకాశం ఇస్తోంది. ప్రతి సంవత్సరం జనవరి 1కి బదులుగా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 న ఓటర్ల నమోదుకు అర్హత తేదీగా ఈసీ నిర్ణయించింది. ఓటర్ల జాబితాను ప్రతీ మూడు నెలలకోసారి ఆధునీకరించేలా ఏర్పాట్లు చేశారు. అర్హత కలిగిన వారు 18 ఏళ్ల అర్హత వయస్సును సాధించిన సంవత్సరం తరువాత మూడు నెలల్లో ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉండేది. ఇలా జరగడం వల్ల కొందరు యువత ఓటు హక్కును కోల్పోతున్నందున కొత్త ప్రక్రియను ఎన్నికల సంఘం రూపొందించింది.

17 ఏళ్లు దాటిన అభ్యర్థులకు అడ్వాన్స్డ్ ఎన్‌రోల్‌మెంట్‌కు ఈసీఐ అనుమతించినందున దాదాపు 6 లక్షల మంది కొత్త ఓటర్లు రాష్ట్ర ఓటర్ల జాబితాలో చేరే అవకాశమున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఏటా దాదాపుగా రెండు లక్షల మంది కొత్త ఓటర్లు… ఓటర్ల జాబితాలోకి చేరతారు. ప్రతి మూడు నెలలకు ఓసారి కొత్త ఓటర్లు ఎలక్టోరల్ రోల్స్‌లో నమోదవడంతో అర్హత పొందిన వారందరూ ఆయా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుంది. యువకులు తమ సొంత ఊళ్లలోనూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే బూత్ స్థాయి అధికారులు అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించి ఆమోదం తెలుపుతారు. లేదంటే తిరస్కరిస్తారు.

జనవరి 1, 2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువత దరఖాస్తుల నమోదు, అభ్యంతరాలు, కరెక్షన్స్ కోసం డిసెంబర్ 8, 2022లోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. యువకులు ఏప్రిల్ 1, జూలై 1 తర్వాత మూడు అర్హత తేదీలలో.. 2023 అక్టోబర్ 1న ఫారం-6 సమర్పించవచ్చు. ముందుగా నవంబర్ 9, 2022 నుండి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం లభించనుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఎన్నికల నమోదుపై ప్రతికూల ప్రభావం పడిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. త్వరలోనే ఓటు హక్కు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. సిటీలో ఉంటున్న పలువురు యువత… ఆయా ఊళ్లలో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు.