దీపావళి నుంచి జియో 5జీ సేవలు…
భారత టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దీపావళి పండుగ నుంచే.. 5జీ నెట్‌వర్క్ వెలుగులు జిగేల్ మననున్నాయి. దీపావళి నుంచి దేశంలో రిలయన్స్ జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ 45వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM) సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక విషయాలను వెల్లడించారు. జియో 5జీ సేవలు 100 మిలియన్ల కుటుంబాలకు చేరాలనేది తమ లక్ష్యమని అంబానీ పెర్కొన్నారు. ముందుగా ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో వచ్చే దీపావళికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ అందుబాటులోకి వస్తుందని ముఖేశ్ అంబానీ ప్రకటించారు.

ఎటువంటి వైర్లు లేకుండా అందించే ఈ సేవలను జియో ఎయిర్ ఫైబర్‌గా నామకరణం చేసినట్టు తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా 5జీ ట్రూ సేవల కోసం 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. 5G సేవలందించేందుకు మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఎరిక్సిన్,నోకియా, శాంసంగ్,సిస్కో,క్వాల్కంతో భాగస్వామ్యం అవుతున్నట్లు చెప్పారు.