హైవేపై అర్ధరాత్రి ఒకేసారి 50 వాహనాలు పంక్చర్
ముంబయి- నాగపూర్ సమృద్ధి హైవేపై ఒకేసారి 50 వాహనాలు పంక్చర్ కు గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల రాత్రి 10 గంటల ప్రాంతంలో వాషిం జిల్లాలోని మాలెగావ్ మీదుగా వెళుతున్న కార్లు, ట్రక్కులు.. వరుసగా పంక్చర్ అయ్యాయి. దీంతో రహదారిపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఎలాంటి సాయం అందకపోవడంతో రాత్రంతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఇనుప బోర్డు రోడ్డుపై పడి ఉండడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.