బీసీలకు ఈసారి 50 సీట్లు, వైసీపీ లిస్టు విడుదల ముందు ఊహాగానాలు
కాసేపట్లో ఇడుపులపాయ నుంచి వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల జాబితా ఒకేసారి విడుదల చేసేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. గత ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానికి భిన్నంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ 41 మంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వగా ఈసారి 50 వరకు ఇచ్చే అవకాశమున్నట్టు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల ఈక్వేషన్లను సైతం పార్టీ పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావుతో, ఎంపీ అభ్యర్థుల జాబితాను బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ చదివి విన్పించనున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి పార్టీ నేతలకు వర్తమానం అందింది. మధ్యాహ్నం ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనాల్సిందిగా పార్టీ అభ్యర్థులను ఆదేశించింది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం సుడిగాలి పర్యటనలకు బయల్దేరేందుకు రంగం సిద్ధమైంది. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున జగన్ ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.