NationalNews Alert

ఇంటికి 5 నిమిషాల చేరువలోనే..దారుణం

మరో అయిదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనుకునే లోపే మృత్యువు వారిని కబలించింది. వారు అనుకున్న దానికి పూర్తి భిన్నంగా వారిని తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైస్పీడ్‌లో వస్తున్న కారు..ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులను ఒంగోలుకు చెందిన పవన్ కుమార్ , శ్రీను , పరమేష్‌గా గుర్తించారు. కాగా వీరంతా తమిళనాడులోని చెన్నైకి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో మృతుల బంధువులు , స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనకు డ్రైవర్ కునుకుపాటే కారణమని ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.