ఐదుగురు మంత్రులపై జగన్ వేటు? ఎందుకంటే?
◆ మంత్రివర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించిన జగన్
◆ దసరాలోపు ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు
◆ 5గురు మంత్రులను మార్చే అవకాశం
◆ మరికొంత మందికి శాఖల మార్పు
◆ పనితీరుసరిగా లేకపోవడమూ కారణమే…
◆ ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొట్టలేకపోవడమే?
ఏపీలో ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా 175 /175 నియోజకవర్గాలు గెలవాలనే తలంపుతో పనిచేస్తున్న జగన్ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. గతంలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోతే వారికి ఈసారి ఎన్నికలలో టికెట్లు కేటాయింపు ఉండదు అని హెచ్చరించి ఆ దిశగా అడుగులు వేసి మొదటగా అమరావతి రాజధాని కేంద్రంగా ఉన్న తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తను నియమించి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అలజడి రేగేలా చేశారు. అలానే రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రుల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మీరు మారకపోతే నేనే మార్చేస్తానంటూ హెచ్చరికలు కూడా చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో దసరా లోపే కొంతమంది మంత్రులను మార్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేపట్టేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

పలువురు మంత్రులు శాఖలపై పట్టు సాధించలేకపోవడం, వివిధ ఆరోపణలు ఎదుర్కోవడం వంటి కారణాలతో వారిని మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడున్న మంత్రుల్లో ఒక ఐదుగురు వరకు మారే అవకాశాలు ఉన్నాయని మరికొంతమందికి శాఖలు మార్చే దిశగా జగన్ కసరత్తు చేస్తున్నారని, ఈ క్యాబినెట్ తో ఎలక్షన్‌కు వెళ్లలేమన్న భావనలో జగన్ ఉన్నారని దసరాలోపు చేపట్టే మార్పులలో పవర్ ఫుల్ క్యాబినెట్‌ను సిద్ధం చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. గడచిన ఆరు నెలల పని తీరు ఆధారంగా మంత్రుల మార్పు ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన కొత్త మంత్రి వర్గాన్ని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంతో నమ్మకంతో ఈ క్యాబినెట్‌తో ఎలక్షన్‌కు వెళ్లాలని భావించిన జగన్‌కు చుక్క ఎదురయింది. కొంతమంది మంత్రులు ఆశించిన స్థాయిలో వేగాన్ని అందుకోలేక పోవటం సొంత శాఖలో జరుగుతున్న లోపాలను కూడా గమనించలేకపోవటం పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం ముఖ్యంగా జగన్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపై విపక్షాలు చేస్తున్న అనేక ఆరోపణలపై కొంతమంది మంత్రులు నోరు మెదపకపోవడం వంటి కారణాలతో క్యాబినెట్ నుండి వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆలోచనకు జగన్ వచ్చినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత కల్పించారు. ఆ దిశగానే జాబితాను కసరత్తు చేశారు. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో తీసేసిన మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన వారిని నియమించాలని యోచనలో జగన్ ఉన్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండటంతో బలమైన నేతలను తీసుకోవడం ద్వారా విపక్షాలను దీటుగా ఎదుర్కోవచ్చని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో కొత్త ముఖాలపై అన్వేషణ కూడా మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. రెండు రోజులు క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో… మంత్రుల్లో చలనం వచ్చినట్టు తెలుస్తోంది. గురువారం పలువురు మంత్రులు చంద్రబాబు నాయుడు, లోకేష్, పలువురు టీడీపీ నేతలపై ఒక రేంజ్‌లో కౌంటర్లు ఇచ్చారు. నారా లోకేష్ చేసిన ట్వీట్ పై మంత్రులు మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలపై మంత్రులకు సీఎం జగన్ తీసుకున్న క్లాస్ నేపథ్యంలోనే మంత్రులు స్పందించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా జగన్ అనుకున్నది చేస్తారని దసరా నాటికి మంత్రివర్గ ప్రక్షాళన ఉండవచ్చని ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.

