News

వైసీపీకి 45 నుండి 67 సీట్లే: పవన్ కళ్యాణ్ జోస్యం

◆ 2019 ఎన్నికల అనంతరం పారిపోతానని అనుకున్నారు
◆ నాకు భయం లేదు బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా
◆ మరింత అధ్యయనం తర్వాతనే బస్సు యాత్ర ప్రారంభిస్తా
◆ జనసేన లీగల్ సెల్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

సమాజంలో మార్పు రావాలని వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని, ప్రజలను వదలనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం జనసేన లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గుడ్డిగా మద్దతు ఇవ్వలేదని దాని వెనుక చాలా లోతుగా ఆలోచనలు చేసి పలువురు రాజకీయ నాయకుల సలహాల మేరకే మద్దతు పలికానని అన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం చాలా బాధాకరమని అప్పట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపి అమరావతి రాజధానికి మద్దతు తెలిపిందని ఇప్పుడు మాట మార్చి మూడు రాజధానులని అంటుందని చట్టసభలో ఇచ్చిన మాటను తప్పినప్పుడు వారికి చట్టాలు అమలు చేసే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు.

జీవితంలో తాను చేసిన మంచి ఏదైనా ఉందని అంటే రాజకీయాల్లోకి రావటమేనని తనకి ఎలాంటి భయాలు లేవని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. ఆస్తుల కోసమే షర్మిలకు జగన్ కు మధ్య గొడవలు వచ్చాయని జగన్ పై ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి అధికారం ఇస్తే వారికి తగిన న్యాయ చేయలేకపోతున్నారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఇచ్చి తగినంత బలం ఇస్తే తాము ఏంటో స్పీకర్ కు చూపిస్తామని హెచ్చరించారు. రానున్న ఎన్నికలు చాలా కీలకమని జనసేన కార్యకర్తలుకు నాయకులుకు వీర మహిళలకు లీగల్ సెల్ టీం అండగా నిలవాలని కోరారు.

ఇటీవల వెల్లడించిన కొన్ని సర్వేల ప్రకారం రానున్న ఎన్నికల్లో వైసీపీకి 45 నుండి 67 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా జనసేనకు ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ లో విజయ దశమి తర్వాత బస్సు యాత్ర చేపట్టాలని అనుకున్నాం కానీ తాము నిర్వహిస్తున్న జన వాణీ కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలు తెలుస్తున్నాయని వాటిపైన సమగ్ర అధ్యయనం చేశాకే యాత్రను మొదలు పెడతానని ప్రస్తుతానికి యాత్రను వాయిదా వేస్తున్నామని తెలిపారు. తమ పార్టీ ఏఏ నియోజకవర్గాల్లో బలంగా ఉంది ఎక్కడ బలంగా లేదు అనే దానిమీద అధ్యయనం చేస్తున్నామన్నారు.

నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నానన్న పవన్ కల్యాణ్… ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజ్యాధికారం సాధించే విధంగా ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో ఈసారి జనసేన జెండా రెపరెపలాడే విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని అక్టోబర్ నుండి ప్రతి నియోజకవర్గంపై స్వయంగా పరిశీలన చేస్తానని మొదటగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి సమీక్షలు ప్రారంభిస్తానని ముగించారు.