Home Page SliderNational

భారత్‌లో కాలుష్యం కారణంగా ఏటా 33 వేల మంది మృతి

లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ అనే సంస్థ అధ్యయనం చేసి, భారత్‌లో కాలుష్యం ఎంత తీవ్రస్థాయిలో ఉందో వెల్లడించింది. దీనిలో ప్రమాదకరమైన విషయాలు తెలిసాయి. కేవలం వాయు కాలుష్యం కారణంగానే భారత్‌లోని 10 నగరాలలో ఏటా 33 వేల మందికి పైనే మరణిస్తున్నారని వెల్లడయ్యింది. మనదేశంలోని ప్రధాన నగరాలలో వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో ఉందని, ముఖ్యంగా ఒక్క ఢిల్లీలోనే ఏడాదికి 12వేల మందికి పైన మరణిస్తున్నారని సమాచారం. 2008 నుండి 2020 వరకూ ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఈ అధ్యయనం చేశారు. భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక కాలుష్యనివారణ చర్యలు చేపట్టాలని సూచించింది. దీనికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తే ఫలితం ఉండవచ్చని పేర్కొంది. ఈ రకమైన కాలుష్య కారకాల వలన ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాల ప్రకారం గాలిలో కార్బన్‌డైయాక్సైడ్ నిష్పత్తిని తగ్గించాల్సిన అవసరం ఉంది. వాయుకాలుష్యానికి ప్రధాన కారణం ఇండస్ట్రీలు, ఫాక్టరీలు ఆటోమొబైల్స్, వాహనాల నుండి వచ్చే పొగను ప్రధానకారణంగా చెప్పవచ్చు. ప్రమాదకరమైన వాయువులను, పదార్థాలను విడుదల చేసే సంస్థలకు కొన్ని ప్రమాణ మార్గదర్శకాలు రూపొందించవలసిన అవసరం ఉంది. కాలుష్యం కారణంగా గాలి, నీరు, భూమి అన్నీ ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉంది.