ఉగాండాలోని స్కూల్‌లో కాల్పుల కలకలం-26 మంది మృతి
ఉగాండాలోని ఓ స్కూల్‌పై తిరుగుబాటు దారులు మారణకాండ జరిపారు. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు ఈ దాడులు ‘అలయిడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్'(ADF) కు చెందిన వారే చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘లుబిరిరా’ అనే సెకండరీ స్కూల్‌పై దాడి చేసి, వసతి గృహానికి కూడా నిప్పు పెట్టారు. అక్కడి ఆహారశాలను కూడా దోచుకుని, కొంతమందిని అపహరించుకొని పారిపోయినట్లు తెలిపారు. వారు 20 నుండి 25 మంది దండుగా ఆయుధాలతో వచ్చారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనలో 26 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ మృతుల్లో విద్యార్థులు ఉన్నారా? లేదా? అనే విషయం పోలీసులు తెలియపరచడం లేదు. 1986 నుండి ఇప్పటి ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని పాలనను ఈ తిరుగుబాటు దారులు వ్యతిరేకిస్తున్నారని, 2001లో ఉగాండా సైన్యం దాడి చేయడంతో తూర్పు కాంగోకి పారిపోయారని సమాచారం.వీరికి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌లతో కూడా సంబంధాలున్నాయి. స్కూల్‌పై దాడి అనంతరం వారు కాంగో దేశంలోని విరుంగా జాతీయపార్కు వైపు పారిపోయినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని వెంటాడుతున్నామని పేర్కొన్నారు.