250 కోట్లతో తడిచెత్తనుంచి శుద్ధజలంగా మార్చే ‘లీచేట్ ప్లాంట్’
ఈరోజు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద 250 కోట్ల ఖర్చుతో చెత్త నుండి శుద్ధజలాన్ని వెలికితీసే లీచేట్ ప్లాంటు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఏర్పాటయ్యింది. వ్యర్ధంలోనే ఉంది పరమార్థం అన్నట్లు, జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలోని వ్యర్థం వల్ల చెరువులు కలుషితం కాకుండా చేసే బృహత్ ప్రణాళికను మల్కారం చెరువుపై ప్రారంభించారు కేటీఆర్. ఒక సంవత్సరం లోగా ఈ మల్కారం చెరువును మొత్తం శుద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ విశ్వనగరంలో చెత్తను సేకరించి తరలించడమే పెద్దసమస్య. అలాంటిది దానినుండి వచ్చే లిక్విడ్ లీచట్‌ను ఏం చేయాలనేది అతిపెద్ద సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా దానిని శుద్ధి చేసి, కార్పొరేషన్ పరిధిలోని మొక్కలకు పంపే ఏర్పాటు చేస్తున్నారు. భూగర్భజలాలు, చెరువులు కలుషితం కాకుండా చేసే ఉద్దేశ్యంతో 2017లోనే నాలుగువేల లీటర్ల నీటిని శుద్ధి చేసే ప్లాంటును ఏర్పాటు చేశారు. కానీ దానివల్ల సమస్య తీరలేదు. అందుకే 250 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ ఏర్పాట్లు మొదలుపెట్టారు.