పాక్ మసీదు ఆత్మాహుతి దాడిలో 28 మంది మృతి
పెషావర్ మసీదులో పేలుడు
ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘటన
మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో దాడి
120 మందికి పైగా గాయాలు
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని వాయువ్య నగరం పెషావర్‌లో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా తీవ్రవాదులు పోలీసులు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఐతే మసీదు పైకప్పు, గోడ నిర్మాణంలో కొంత భాగం కూలిపోవడంతో పెద్ద ఎత్తున పోలీసులు శిధిలాల కింద చిక్కుకుపోయారు. పెషావర్ పోలీస్ లైన్స్ ప్రాంతంలో మసీదు వద్ద జరిగిన పేలుడులో కనీసం 28 మంది మరణించారని, 150 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. పెషావర్ కమిషనర్ రియాజ్ మెహసూద్ క్షతగాత్రులను ధృవీకరించారు. మసీదు లోపల అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయినందున రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు. బాధితులకు తక్షణం వైద్య సాయం అందిస్తున్నామన్నారు.

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని లేడీ రీడింగ్ హాస్పిటల్ ప్రతినిధి మహ్మద్ అసిమ్ తెలిపారు. పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలిపోయిందని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్ అన్నారు. చాలా మంది జవాన్లు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 250 నుండి 300 మంది వరకు ఉండే మసీదు ప్రధాన హాలు కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో 300 నుంచి 400 మంది పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్నారని ఖాన్ చెప్పారు. భద్రతా దళాల వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

