Andhra PradeshHome Page Slider

2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ వ్యూహాలు

◆ తెరపైకి కొత్త కొత్త సమీకరణాలు
◆ బీసీల జపం చేస్తున్న రాజకీయ పార్టీలు
◆ గట్టిగా ప్రభావం చూపించాలనుకుంటున్న కాపులు

ఏపీలో క్రమక్రమంగా యువతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రధాన పార్టీల నేతల అడుగులు వాటి దిశగానే పడుతున్నాయి. ఈసారి ఎన్నికలకు బీసీల ఓటు బ్యాంకు కీలకం కానున్న నేపథ్యంలో ఆ సత్యాన్ని గ్రహించిన వైసీపీ, టీడీపీ పార్టీలు బీసీ ఓటు బ్యాంకుపై రాజకీయం చేస్తున్నాయి. ఎన్నికల వేడి రాజుకున్న తరుణంలో కొత్త కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాపులు ఈసారి ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపించాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా వివిధ పార్టీలోని కాపు నేతలంతా ఏకమై ఒకే తాటి పైకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాపులందరినీ ఏకం చేసి కాపు నాయకుడే సీఎం అనే నినాదాన్ని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనెల 26వ తేదీన రంగా వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో కాపునాడు సమావేశాన్ని జరుపుతున్నారు. ఈ సభకు వివిధ పార్టీల్లో ఉన్న కాపు నేతలందరినీ పిలుస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న తరుణంలో ఈ సభా వేదికపై నుంచి రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందులో భాగంగానే వరుసగా కాపు నేతలు సమావేశాలు జరుగుతున్నాయని అంటున్నారు. కానీ ఈ సమావేశానికి అధికార వైసీపీ కాపు నేతలు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది.

కాపు నాడుకు ముందు రోజే డిసెంబర్ 25న తూర్పు కాపుల పిక్నిక్ పేరుతో అధికార పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఉత్తరాంధ్ర కాపు నేతలకు ఆహ్వానాల కూడా వెళ్లాయని అంటున్నారు. కాపులంతా జనసేన పార్టీకి మద్దతు తెలుపుతారన్న వార్తల నేపథ్యంలోనే అధికార వైసీపీ ముందు రోజే సమావేశం నిర్వహిస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించే దిశగా ఇప్పటికే వైసీపీ అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తుంది. అలానే బీసీలను దగ్గరకు చేర్చుకునే విధంగా వైసీపీ ఇప్పటికే 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీ కులాల్లో బలం పెంచుకుంది. రానున్న ఎన్నికల్లో కూడా అదే పంథాను కొనసాంగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విజయవాడలో వైసీపీ నిర్వహించిన బీసీ ప్రజా ప్రతినిధుల సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ జోష్‌లో ఉంది. టీడీపీ స్థాపించిన నాటి నుండి ఆ పార్టీకి వెన్నెముకగా నిలుస్తోన్న బీసీలు 2019 ఎన్నికలలో వైసీపీకి కాపు కాయటంతో ఆ ఎన్నికలలో టీడీపీ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా చేజారిపోయిన బీసీ ఓటు బ్యాంకును తమ పార్టీ వైపుకు మళ్ళీ తెచ్చుకోవాలన్న భావనతోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. బీసీ ఓటు బ్యాంకు ప్రాధాన్యతను తెలుసుకున్న వైసీపీ అధినేత జగన్ కూడా బీసీ జన గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపారు. ఇలా ఇరు పార్టీలు రానున్న ఎన్నికలను కీలకంగా చేసుకొని కాపు సామాజిక వర్గంతో, పాటు బీసీలను దగ్గరగా చేసుకునే అధికారం చేపట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే ఈ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి ఈసారి ఎన్నికల్లో కాపులు, బీసీలు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో చూడాల్సి ఉంది.