కర్నాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు 17% జీతాలు పెంపు
కర్నాటక ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర ఉపశమనంగా 17% జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. 7వ వేతన సంఘం, జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) ఉపసంహరణ వంటి తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బుధవారం ఆందోళన ప్రారంభించడంతో ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్లు, ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై… ఉద్యోగుల రెండు ప్రధాన డిమాండ్లను అంగీకరించామని… సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. 7వ పే కమిషన్‌ను నియమించామని, మధ్యంతర ఉపశమనంగా 17% జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్‌పిఎస్‌కు సంబంధించి, ఇతర రాష్ట్రాల్లోని ఎన్‌పిఎస్, ఆర్థిక పరిణామాలను అధ్యయనం చేసి, అదనపు ప్రధాన కార్యదర్శి ఒక కమిటీకి నాయకత్వం వహిస్తారని, రెండు నెలల్లో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారని చెప్పారు.

