17 లోక్ సభ స్థానాలే లక్ష్యంగా రేపట్నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్ర
‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించబోతోంది. విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 2వ తేదీన ముగుస్తుంది. నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న భావనలో ఉన్న పార్టీ.. ఇప్పుడు తెలంగాణలో 17 సీట్లలో విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకొంది. కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం అప్పుడే సాధ్యమవుతుందని, ఎక్కువ ఎంపీలను గెలిపించుకోవడం ద్వారా, తెలంగాణ అభివృద్ధి సాకారమవుతుందన్న నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని పార్టీ యోచిస్తోంది.

గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలవగా, రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల కేంద్రాలలో అన్ని సామాజికవర్గాల ప్రజలతో మమేకమవుతూ, రోడ్ షోలు నిర్వహించుకుంటూ యాత్ర సాగుతుందని, పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి, మోదీ భరోసా అందించాలని పార్టీ భావిస్తోంది. మార్చి 2వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించే విధంగా కార్యాచరణను పార్టీ సిద్ధం చేసింది. ఎవరికీ సొంత అజెండాలుండవని.. అంతా, పార్టీ జెండా నేతృత్వంలోనే కొనసాగుతుందన్న క్లారిటీ కూడా పార్టీ ఇస్తోంది. 5గురు ఎంపీలు, 8 మంది ఎంపీలతోసహా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలందరూ కార్యక్రమాల్లో పాల్గొనేలా యాత్రకను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.

విజయసంకల్ప యాత్ర 20న ప్రారంభమవుతుంది. యాదాద్రి భునవగిరి నుంచి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేందర్ సంయుక్తంగా యాత్ర ప్రారంభింస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నేతలు పాల్గొంటారు. 21న కొమరంభీం విజయసంకల్పయాత్రలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ శర్మతోపాటుగా, ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొంటారు. 22న రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్రలో పార్టీ ముఖ్యనేత కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, బండి సంజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారు. 23న కృష్ణమ్మ విజయసంకల్ప యాత్రలో పరుషోత్తమ్ రూపాల, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. ఇక ఐదో రోజు భద్రాద్రి విజయసంకల్పయాత్రకు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి హాజరవుతారని పార్టీ తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమాల్లో ముందుండి నిర్వహంచేలా పార్టీ ప్లాన్ చేస్తోంది.

ఐదు క్లస్టర్లలో, పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. గతంలో విజయయాత్రలు నిర్వహించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో యాత్ర ద్వారా పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిందని, తెలంగాణలోనూ యాత్ర ద్వారా విజయం ఖాయమని పార్టీ విశ్వాసంతో ఉంది. రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, రైతులు, బడుగుబలహీన వర్గాల ప్రజలందరూ నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని.. ఆ ఉద్దేశం యాత్ర ద్వారా ప్రస్ఫుటమవుతుందని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో కార్యక్రమం ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లో పార్లమెంట్ కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని అడుగులు వేస్తామంటున్నారు. త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళలు నరేంద్రమోదీ నాయకత్వం కోరుకుంటున్నారని.. వారందరూ కూడా లోక్ సభ ఎన్నికల్లో పార్టీని బలపరుస్తున్నారని పార్టీ భావిస్తోంది.
Read more: రాహుల్ గాంధీకి అఖిలేష్ యాదవ్ 15 సీట్ల ఆఫర్, ఐతే కండిషన్స్ అప్లై