కర్నూలులో బస్సు ఘటనపై విచారణకు16 ప్రత్యేక బృందాలు
కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న భయానక బస్సు ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేయడానికి 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత శుక్రవారం వెల్లడించారు . ఈ ఘటనలో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారని . మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని ఆమె తెలిపారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రి అనిత, మంత్రి రాం ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
మృతుల్లో ఏపీ, తెలంగాణకు చెందినవారు చెరో ఆరుగురు, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు చెందినవారు ఒక్కొక్కరు, అలాగే తమిళనాడు, కర్ణాటకలకు చెందినవారు చెరో ఇద్దరు ఉన్నారు. మరో వ్యక్తి మృతదేహం గుర్తించాల్సి ఉందని తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 9 మంది క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. అతను ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలు చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయాయి. అందువల్ల డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా కుటుంబ సభ్యులకు మృతదేహాలు అందజేస్తాం’ అని చెప్పారు.
మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుంది అని ప్రకటించారు.
కర్నూలు జిల్లా పోలీసులు, ఫైర్ సిబ్బంది, వైద్య బృందాలు సంఘటనా స్థలంలో పనిచేస్తూ, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలియాల్సి ఉన్నా, బస్సు అధిక వేగం లేదా సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబాలకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

