Home Page SliderTelangana

‘బిగ్‌బాస్’ గొడవలో మరో 16 మంది అరెస్టు..విన్నర్ ప్రశాంత్ 14 రోజుల రిమాండ్

Share with

బిగ్‌బాస్ షో విన్నర్ ప్రశాంత్, అతని సోదరుడు సహా 16 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఏ1గా ఎఫ్‌ఐఆర్ నమోదైన ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది నాంపల్లి కోర్టు.   సంచలనం సృష్టించిన బిగ్‌బాస్ తెలుగు షోలో రైతుబిడ్డనంటూ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు యూట్యూబర్ పల్లవి ప్రశాంత్. ఆపై ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ చివరికి టైటిల్ చేజిక్కించుకున్నాడు. రూ.35 లక్షలతో పాటు రూ.15 విలువ చేసే డైమండ్ జ్యూవెలరీని, విలువైన కారును బహుమతిగా అందుకున్నాడు. కానీ అతని ఆనందం ఒక్కరోజు కూడా నిలువలేదు. గెలుపు వెంటనే దురదృష్టం వెంటాడుతూ వచ్చింది. టైటిల్ విన్నర్ కాగానే, అతని అభిమానులు, బంధువులు చేసిన బీభత్సం వల్ల ప్రభుత్వ ఆస్తికి ధ్వంసం కలిగింది.

కార్లు, బస్సుల అద్దాలు పగలగొట్టడం, కారులో అతనిని ఊరేగింపుగా తిప్పడం, పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకపోవడం వంటి చర్యలతో కోర్టు అతనిని దోషిగా తేల్చింది. ఈ గొడవలకు సంబంధించి మరో 16 మందిని కూడా అరెస్టు చేశారు. వారిలో నలుగురు మైనర్లు కావడంతో వారిని రిమాండ్‌లో తీసుకోలేదు. పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాకే ఈ గొడవ మొదలయ్యిందని, బస్సులపై రాళ్లు రువ్వారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఈ నిందితులలో ఏ3 గా ఉన్న వ్యక్తి తప్పించుకున్నాడని, ప్రశాంత్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని వాదనలు వినిపించారు. వీరి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీనితో వీరిని చంచల్ గూడా జైలుకు తరలించారు.