NationalNews

దీపావళికి సొంతూరుకు వెళ్తూ 15 మంది కూలీల దుర్మరణం

మధ్యప్రదేశ్: మనసర్కార్ :

మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతంలో బస్సులో యూపీకి చెందిన కూలీలు ప్రయాణిస్తున్న బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది  అక్కడికక్కడే మృతిచెందారు. సొంత ఊరును వదిలి ఎక్కడో పనిచేసుకుంటూ జీవించే రోజుకూలీలు వారంతా. దీపావళి పండగను కుటుంబంతో జరుపుకోవాలనే కోరికతో స్వగ్రామాలకు బయలుదేరిన వారిని ఈ ప్రమాదం పొట్టన పెట్టుకుంది. 60 మంది కూలీలు హైదరాబాద్ నుండి గోరఖ్‌పూర్‌కు బయలుదేరారు. వీరి బస్సు శుక్రవారం రాత్రి 10.30 లేదా 11గంటల మధ్య రేవా ప్రాంతానికి చేరుకోగానే ముందు వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడ్డారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుగా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. వీరి మృతదేహాలు బస్సులో నుండి బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలియజేశారు.  మృతదేహాలను ప్రయాగ్ రాజ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకువెళ్తుంది. ఈ విషయంగా ఆదిత్యనాథ్ కూడా చాలా విచారం వ్యక్తం చేశారు.