రష్యా స్కూల్‌లో కాల్పుల కలకలం… 13 మంది మృతి
రష్యాలోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెగబడి అమాయక విద్యార్థులను పొట్టన పెట్టుకున్నాడు. సోమవారం ఉదయం ఇజెవ్‌స్క్ నగరంలో జరిగిన ఈ ఘటనలో టీచర్లు, విద్యార్థులు కలిపి 13 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. దాడి జరిగినప్పుడు స్కూల్‌లో వెయ్యి మంది విద్యార్థులు, 80 మంది టీచర్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ముసుగు తొడుక్కొని వచ్చిన దుండగుడు స్కూల్ గేట్ వద్ద ఉన్న గార్డును చంపేసి లోనికి దూసుకొచ్చాడు. తర్వాత తరగతి గదుల్లోకి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. తరగతి గదులు రక్తపు మరకలతో భయంకరంగా మారాయి.

బల్లల కింద దాక్కున్నారు..
క్లాసులు జరుగుతుండటంతో పాఠశాల గదులు కిక్కిరిసి ఉన్నాయి. కాల్పుల శబ్దం విన్న విద్యార్థులు, టీచర్లు బల్లల కింద దాక్కొని ప్రాణాలు దక్కించుకున్నారు. గాయపడిన ఓ విద్యార్థితో స్కూలు ప్రధానోపాధ్యాయురాలు ఓ గదిలో దాక్కున్నారు. కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు నాలుగో అంతస్తులోకి వెళ్లి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.