125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి అరుదైన “హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్” లో చోటు
‘హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో హైదరాబాదులోని 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహం నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు సమర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళితబాంధవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నిన్న 125 అడుగుల అతిపెద్ద లోహ విగ్రహం ఆవిష్కరణ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ కూడా పాల్గొన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతోంది.

‘హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థానం పొందటం అభినందనీయన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో దీనిని నిర్మించారు. దీనికి ఎన్టీఆర్ గార్డెన్ పక్కన గల 12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అంబేడ్కర్ స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని కొప్పుల వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే ఈ అంబేద్కర్ విగ్రహం టూరిజం స్పాట్ గా మారుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞశర్మ, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్, హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్స్ శ్రీకాంత్, సుమన్ పల్లె తదితరులు పాల్గొన్నారు.

