1000 రోజుల అమరావతి ఉద్యమం
◆ నేటి నుంచి మరో పాదయాత్రకు అమరావతి రైతులు శ్రీకారం
◆60 రోజులు 600 మంది 630 కిలోమీటర్లు పాదయాత్ర
◆ పాదయాత్రకు అనుమతినివ్వని ప్రభుత్వం, పోలీస్ శాఖ
◆ హైకోర్టు అనుమతితో నేటి నుండి పాదయాత్ర ప్రారంభం
◆ హాజరు కానున్న వివిధ రాజకీయ పక్ష నేతలు
ఏపీలో అమరావతి రాజధాని కోసం నమ్మి భూములు ఇచ్చిన రైతులు నడిరోడ్డుపై నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. మీ భూములు ఇవ్వండి మేం భవిష్యత్ ఇస్తాం మీరు చేసిన త్యాగానికి ఫలితం ఉంటుందని ఆనాడు ప్రభుత్వం భరోసా ఇవ్వటంతో రైతులు నమ్మి భూములు ఇచ్చారు. మూడేళ్లు అంతా బాగా గడిచింది. అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. అమరావతికే మా మద్దతు అని ప్రకటించి అధికారంలోకి వచ్చిన వైసీపీ, అనంతరం మాట మార్చేసింది. 2019 డిసెంబర్ 17న శాసనసభ వేదికగా మూడు రాజధానులని కొత్త ప్రకటన చేయటంతో, రైతుల ప్రపంచం తలకిందులైంది. జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి రైతులు భగ్గుమన్నారు.

ఆ మరుసటి రోజు నుండే సేవ్ అమరావతి ఉద్యమంతో ముందుకు కదిలారు. ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని అప్పటినుండి రైతులు, మహిళలు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతి ఉద్యమం మొదలై నేటికి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది.ఒకవైపు దీక్షలు మరోవైపు ర్యాలీలు నిర్వహిస్తూ వెనక్కు తగ్గకుండా అమరావతి రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతి నినాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా వినిపించాలన్న లక్ష్యంతో గతంలో అమరావతి రైతులు మహిళల న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహాపాదయాత్రను నిర్వహించారు. అలానే ఇప్పుడు మరో మహా పాదయాత్రకు అమరావతి రైతులు,మహిళలు సిద్ధమయ్యారు.

60 రోజులు పాటు 600 మందితో 630 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో నేటి ఉదయం ప్రారంభం కానున్న ఈ మహా పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ముగియనుంది. ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోయినా హైకోర్టు ద్వారా షరతులతో కూడిన అనుమతులు తీసుకొని రైతులు పాదయాత్రను చేపట్టనున్నారు. ఈ పాదయాత్రతో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడంతోపాటు ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని అమరావతి జేఎసి నేతలు భావిస్తున్నారు. ఈ యాత్రకు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని ప్రకటించి మద్దతుగా నిలిచాయి. ఈసారి జరిగే పాదయాత్రకు అమరావతి రైతులు ఒక ప్రత్యేక రథాన్ని రూపొందించారు. అశ్వాలతో కూడిన ఒక ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు.

మొత్తం 60 రోజులు పాటు సాగే యాత్రలో ప్రతి ఎనిమిది రోజులకి ఒకసారి విరామం ఇవ్వనున్నారు. ఈ యాత్ర విజయవంతం కావాలని ఆదివారం రైతులు మహిళలు యజ్ఞాన్ని కూడా చేశారు. యాత్రకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ప్రశాంతంగా సాగాలన్న సంకల్పంతో దీక్షా శిబిరంలో యజ్ఞాన్ని నిర్వహించారు. యాత్ర ప్రారంభోత్సవానికి వామపక్ష పార్టీలు నేతలతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన నేతలు సంఘీభావాన్ని స్వయంగా ప్రకటించనున్నారు. నారా లోకేష్ తో పాటు ముఖ్య నేతలు రైతులు పాదయాత్రలో పాల్గొననున్నారు.