తొలిరోజే 100 సంతకాలు.. ట్రంప్ పట్టుదల
అమెరికా అధ్యక్షునిగా నేడు రెండవసారి డొనాల్డ్ ట్రంప్ పదవీ స్వీకారం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 10.30 గంటలకు ఆయన వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తొలిరోజే సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. దీనికోసం ఆయన బృందం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల మేరకు ఇవి జారీ చేయబోతున్నారు. అమెరికా దక్షిణ సరిహద్దుల మూసివేత, ట్రాన్స్ జెండర్ల హక్కులు, క్యాపిటల్ భవనం వద్ద గతంలో రగడ చేసిన 1500 దోషులును విడుదల చేయడం, పలు దేశాలపై అదనపు సుంకాల విధింపు వంటివి ఈ ఉత్తర్వులలో ఉన్నాయి. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. త్వరలోనే భారత్, చైనాలలో ట్రంప్ పర్యటించే అవకాశముంది.