అంబానీల పెళ్లి వేడుకకు 100 ప్రైవేట్ విమానాలు
అనంత్ అంబానీ-రాధికామర్చంట్‌ల వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీరి పెళ్లి వేడుకలకు వచ్చే అతిథులను తరలించేందుకు ఏకంగా 100 ప్రైవేట్ విమానాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. వివాహ వేదిక వద్దకు గెస్ట్‌లను తరలించేందుకు ఏకంగా మూడు ఫాల్కన్-2000 జెట్స్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా వెల్లడించారు. దేశంలోని పలు ప్రాంతాల నుండి అతిథులు వస్తున్నారని, వారిని వివాహానికి తరలించేందుకు ఈ విమానాలను చాలా ట్రిప్పులు తిప్పాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 1200 మంది ముఖ్య అతిథులు ఈ వేడుకలకు హాజరవుతున్నట్లు విదేశీ పత్రికలు కూడా పేర్కొన్నాయి. వీరి వివాహ వేడుకలలో భాగంగా నేడు శివశక్తి పూజను నిర్వహించారు. వారి స్వగృహం ఆంటిలియాలో ఏర్పాటు చేసిన భారీ శివలింగం వద్ద ఈ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖేష్, నీతా, అనంత్, రాధిక పాల్గొన్నారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 12న శుభ్ వివాహ్‌తో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. 13, 14 తేదీలలో శుభ్ ఆశీర్వాద్, మంగళ్ ఉత్సవ్‌తో వీరి వివాహ వేడుకలు ముగుస్తాయి.
