Home Page SliderTelangana

తెలంగాణ మెడికల్ కాలేజీల సీట్ల అమ్మకంలో 100 కోట్ల స్కాం

తెలంగాణ మెడికల్ కాలేజీలపై గత కొన్ని రోజులుగా ఈడీ రైడ్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మెడికల్ కాలేజీల సీట్ల అమ్మకం విషయంలో దాదాపు 100 కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు అనుమానిస్తున్నారు ఈడీ అధికారులు. 2016 నుండి 2022 వరకూ కొన్ని కళాశాలలో పీజీ సీట్లు బ్లాక్ చేసి, అధిక ధరలకు అమ్ముకున్నారని రాష్ట్రవ్యాప్తంగా 9 ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఈడీ రైడ్స్ నిర్వహించింది. వీటిలో మల్లారెడ్డి కాలేజ్‌ రైడ్‌లో భారీగా నగదు, కీలక పత్రాలు కూడా లభించాయి. కళాశాల నిధులను సొంత ఖాతాలకు కూడా మళ్లించినట్లు సమాచారం అందింది. కళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు ఆధారంగా మనీలాండరింగ్ కేసు కింద ఈడీ కేసు నమోదు చేసింది.

గతంలో కొందరు ప్రవాస భారతీయ కోటాను ఎంచుకున్న విద్యార్థులు ఆసీట్లను బ్లాక్ చేసి, వాటిలో జాయిన్ కాకపోవడంతో కాళోజీ వర్సిటీ వారిని వివరణ కోరింది. దానికి వారు తాము అసలు దరకాస్తు కూడా చేయలేదని వెల్లడించడంతో అసలు విషయం బయటపడింది. సీట్ల విషయంలో విద్యార్థుల పేరుతో సీట్లు బ్లాక్ చేస్తున్నారని అనుమానించి వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది వర్సిటీ. ఇలా చివరి కౌన్సిలింగ్ వరకూ రెండు మూడు కాలేజీలలో పీజీ సీట్లను ఒక విద్యార్థి పేరుతోనే బ్లాక్ చేస్తున్నారు. దీనివల్ల అర్హత పొందిన మరో విద్యార్థికి సీటు దక్కదు. దీనితో చివరకి కాలేజ్ నిర్వహకులు వారే సీట్లను అమ్ముకుని భర్తీ చేసుకునే వీలు కల్పించుకున్నారు. ఇలా గత ఏడాదిలో 45 సీట్లు పక్కదారిలో భర్తీ అయ్యాయని కాళోజీ వర్సిటీ అంతర్గత విచారణలో తేలింది. పోలీస్ దర్యాప్తు కొనసాగుతూండగానే, ఈడీని కూడా రంగంలోకి దించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సీట్ల స్కాం బయటపడుతోంది.