చేతుల్లో తమ్ముడి మృతదేహంతో 10 ఏళ్ల బాలుడు..!
ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ10 ఏళ్ల బాలుడు తన రెండేళ్ల సోదరుడి మృతదేహాన్ని తన చేతుల్లో పట్టుకుని తీసుకువెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్పత్రి వాళ్లు అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో పోస్టుమార్టం తర్వాత తన రెండేళ్ల సోదరుడిని చేతుల్లో పట్టుకుని ఇంటి వరకూ నడుచుకుంటూ వెళ్లాడు. ఇది చూసిన వారు చలించిపోయారు. ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ-సహారన్‌పూర్ హైవేలోని భాగ్‌పట్ లో ఏడుపు ఆపడం లేదన్న నెపంతో రెండేళ్ల బాలుడిని సవతి తల్లి సీత కారు కిందకు తోసేసింది. దాంతో రెండేళ్ల కళాకుమార్ చనిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో బాగ్‌పత్ సర్కిల్ పోలీస్ అధికారులు ఆ మహిళను అరెస్టు చేశారు. బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రిలోని పోస్ట్‌మార్టం హౌస్‌కు పంపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని షామ్లీ జిల్లాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న అతని తండ్రి ప్రవీణ్ కుమర్‌కు అప్పగించారు. ప్రవీణ్‌తో పాటు బంధువు రాంపాల్, కుమారుడు సాగర్ ఉన్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనాన్ని ఏర్పాటు చేయాలని ప్రవీణ్ పలుమార్లు ఆరోగ్య శాఖ సిబ్బందిని, అధికారులను అభ్యర్థించాడని వారి బందువు రాంపాల్ ఆరోపించారు. అయితే, వారు తన అభ్యర్థనను పట్టించుకోలేదని వాపోయాడు.