హైకోర్టు కు ఐబొమ్మ రవి
తెలుగు చిత్ర పరిశ్రమకు వందల కోట్ల నష్టాన్ని మిగిల్చిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గతంలో నాంపల్లి కోర్టులో ఆయన దాఖలు చేసిన ఐదు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం వరుసగా తిరస్కరించింది. రవికి విదేశీ పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని పోలీసులు గట్టిగా వాదించడంతో కింది కోర్టు బెయిల్ నిరాకరించింది.
దీంతో రవి తన న్యాయవాది ద్వారా తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. బెయిల్ అంశంపై తమ అభ్యంతరాలు లేదా వెర్షన్‌ను తెలపాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ పిటిషన్‌ను పోలీసులు వచ్చే మంగళవారం లోపు దాఖలు చేయాల్సి ఉంది. పోలీసుల కౌంటర్ దాఖలు చేసిన తర్వాత, నిందితుడికి బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.

