రిమోట్ కంట్రోల్ అని పిలవడం అవమానించడమే..!
మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ కూడా అసమానమైన స్థాయి గలవారని వారు రిమెట్ కంట్రోల్‌లా పనిచేయరన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పోటీలో నిలిచిన ఇద్దరిని రిమోట్ కంట్రోల్ ప్రయోగం చేయడం వారిని అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా, నిర్ణయాలు తీసుకోవడంలో, సంస్థను నడిపించడంలో వారికి స్వేచ్ఛ ఉంటుందని నొక్కి చెప్పారు. భారత్ జోడో యాత్ర కర్ణాటకలో జరుగుతున్న తరుణంలో ఆయన మీడియాతో సమావేశమయ్యారు. 22 ఏళ్ల విరామం తర్వాత, అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ ఇద్దరు అభ్యర్థులు అత్యున్నత పదవికి పోటీ పడుతున్నారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.
కాంగ్రెస్ పార్టీ ఫాసిస్ట్ పార్టీ కాదని… చర్చల ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని కోరుకుంటుందని… భిన్నాభిప్రాయాలను గౌరవిస్తామన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే అందరం కలసికట్టుగా పని చేయాల్సి ఉంటుందన్నారు. భారత్ దేశం రాష్ట్రాల సమాఖ్య అని… మన భాషలు, రాష్ట్రాలు, సంప్రదాయాలన్నింటికీ సమాన ప్రాముఖ్యమైన స్థలం ఉందన్నారు రాహుల్ గాంధీ. దేశంలో ద్వేషం, హింసను వ్యాప్తి చేయడం దేశ వ్యతిరేక చర్య అన్నారు. ద్వేషం, హింసను వ్యాప్తి చేసే ఎవరితో ఎంత వరకైనా పోరాడతానన్నారు రాహుల్ గాంధీ.

బీజేపీ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తోందని… దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని దుయ్యబట్టారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం, దేశాన్ని విభజించడం మంచిది కాదన్నారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనే భారత్ జోడో యాత్ర చేస్తున్నామన్నారు. నేనొక్కడినే భారత్ జోడో యాత్ర చేయడం లేదని… లక్షలాది మంది ఉన్నారన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ రాజకీయాలతో భారత ప్రజలు విసిగిపోయారని, ధరల పెరుగుదల, నిరుద్యోగంతో తల్లడిల్లిపోతున్నారన్నారు.

