News

ముస్లింలు 18%, సిక్కులు 2% కానీ…” సుఖ్బీర్ సింగ్ బాదల్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్. సిక్కుల చరిత్ర తెలియని వ్యక్తి అంటూ పంజాబ్ సీఎంపై విరుచుకుపడ్డారు. అందుకే అతన్ని సిక్కుగా పరిగణించడం లేదని అన్నారు. సిక్కు అని చూపించడానికి తలపాగా ధరిస్తాడు. అతనికి సిక్కుల చరిత్ర తెలియదు. మేము అతనిని చూసినప్పుడు, ప్రకటనలు వింటున్నప్పుడు బాధగా ఉంటుందని ఆయన చెప్పారు. దేశంలో ముస్లింల జనాభా దాదాపు 18 శాతం ఉంది, కానీ వారు ఐక్యంగా లేనందున వారికి నాయకత్వం లేకుండా పోయిందని… అదే తాము 2 శాతం ఉన్నప్పటికీ… అకల్ తఖ్త్ సాహిబ్ కింద ఐక్యంగా ఉన్నామన్నారు. పంజాబ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నడుపుతున్నారని.. భగవంత్ మాన్ సింగ్ కాదని, బాదల్ పేర్కొన్నారు.

ఆప్ పంజాబ్‌ను దోచుకుంటోంది. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు కానీ… భగవంత్ మాన్ కాదని అకాలీ నాయకుడు విమర్శించారు. 2022 రాష్ట్ర ఎన్నికలలో 117 మంది సభ్యుల అసెంబ్లీలో 92 స్థానాలను కైవసం చేసుకుని, 18 సీట్లు గెలుచుకోగలిగిన కాంగ్రెస్‌ను ఓడించి అఖండ విజయంతో ఆప్ పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది. శిరోమణి అకాలీదళ్.. దేశంలోని సిక్కు జనాభా ఉన్న అన్ని రాష్ట్రాల్లో పార్టీ యూనిట్లను ఏర్పాటు చేస్తుందని తాజాగా ఆయన ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సిక్కులు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో విడిపోయి జీవిస్తున్నప్పటికీ… ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా అకాలీ నాయకుడు S మంజిత్ సింగ్ GK తన మొత్తం జాగో పార్టీ బృందంతో పాటు శిరోమణి అకాలీ దళ్‌లో తిరిగి చేరారు. ఈ ఐక్యత సిక్కు సమాజాన్ని బలోపేతం చేయడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న మా అన్ని డిమాండ్ల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని నేను కచ్చితంగా అనుకుంటున్నానని బాదల్ అన్నారు. విభేదాలను విస్మరించి ఒకే జెండా కిందకు రావాలని అకాలీ అసమ్మతి నేతలకు బాదల్ ఇటీవల విజ్ఞప్తి చేశారు. ‘పాంథిక్’ ఆలోచన ఉన్నవారికి, గుండెల్లో, రక్తంలో శిరోమణి అకాలీదళ్ ఉన్నవారికి, శిరోమణి అకాలీదళ్‌ ఒక్కటేనని, విడదీయాలనుకునే వర్గాల వారికి ఐక్యతలోనే బలం ఉందని చెప్పాలనుకుంటున్నానన్నారు.