మధు పార్క్ అపార్ట్‌మెంట్‌ను కూల్చనివ్వను
బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసితులకు చేవెళ్ల భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ భరోసా ఇచ్చారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి పేరుతో 450 కుటుంబాలు నివసిస్తున్న ఈ అపార్ట్‌మెంట్‌కు అధికారులు నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆదివారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌ను సందర్శించిన ఆయన, బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. క్షేత్రస్థాయిలో సరిగ్గా తనిఖీ చేయకుండానే అధికారులు ఈ నోటీసులు జారీ చేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అపార్ట్‌మెంట్‌ను కూల్చకుండా చూసుకునే పూర్తి బాధ్యత తనదని ఆయన నివాసితులకు మాటిచ్చారు.
ఈ సమస్య పరిష్కారం కోసం తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, నోటీసులను వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోతే, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి పరిస్థితిని వివరించి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ నేతలు కూడా తనపై బురద జల్లవద్దని, రాజకీయాల కంటే బాధితుల సమస్యను పరిష్కరించడమే తన ప్రథమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ బీజేపీ ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

