Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కోర్టులకు శనివారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌లోని పలు కోర్టుల్లో బాంబులు పెట్టామని, మధ్యాహ్నం 12.05 గంటలకు అవి పేలుతాయని ఆగంతకులు పంపిన ఈ-మెయిల్స్‌తో న్యాయవ్యవస్థ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టులతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కోర్టు, రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులకు ఈ బెదిరింపు మెయిల్స్ అందాయి. మొత్తం 12 RDX బాంబులను ఆయా కోర్టు ప్రాంగణాల్లో అమర్చామని, ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే న్యాయమూర్తులందరినీ కోర్టుల నుంచి ఖాళీ చేయించాలంటూ సదరు మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు.
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయా కోర్టుల వద్దకు చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు పిటిషనర్లను వెంటనే భవనాల నుంచి బయటకు పంపించి, బాంబు స్క్వాడ్స్ మరియు డాగ్ స్క్వాడ్స్‌తో కోర్టు ఆవరణలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ హఠాత్పరిణామంతో కోర్టులకు వచ్చిన జనం భయాందోళనతో పరుగులు తీశారు. సోదాల తర్వాత ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కేవలం భయపెట్టడానికి చేసిన పనినా లేక ఏదైనా కీలక కేసును తప్పుదోవ పట్టించేందుకు పన్నిన కుట్రనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సైబర్ సెల్ అధికారులు రంగంలోకి దిగి ఈ-మెయిల్ ఐడీని విశ్లేషిస్తున్నారు. ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పంపారు అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పరిస్థితి పోలీసుల నియంత్రణలోనే ఉన్నప్పటికీ, కోర్టుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ఇటువంటి అసత్య వార్తలను నమ్మవద్దని పోలీసులు అధికారులు సూచిస్తున్నారు.