ఏడాదికి నాలుగు సార్లు ఓటు నమోదుకు అవకాశం..
రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేస్తూ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2026’ కు సభ ఏకగ్రీవ బుధవారం ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ కొత్త సవరణ ప్రకారం, యువత ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఇకపై ఏడాది పొడవునా వేచి చూడాల్సిన అవసరం లేదు. గతంలో కేవలం జనవరి 1ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల, జనవరి 2న 18 ఏళ్లు నిండిన వారు ఓటు కోసం మరో ఏడాది పాటు ఆగాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తొలగిస్తూ, తాజా సవరణతో ఏడాదికి నాలుగు తేదీలను ,జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, ప్రామాణికంగా నిర్ణయించారు. దీనివల్ల అర్హత ఉన్న యువత వెంటనే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కలుగుతుంది.
అసెంబ్లీ, పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ఈ నాలుగు తేదీల విధానం అమల్లో ఉండగా, ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థలకు కూడా దీనిని వర్తింపజేయడం విశేషం. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ఓటర్ల జాబితా విధానం అమల్లోకి వస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 23న జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ఇప్పుడు శాసనసభ అధికారికంగా చట్టబద్ధత కల్పించింది. ఈ మార్పు వల్ల క్షేత్రస్థాయి ఎన్నికల్లో పారదర్శకత పెరగడమే కాకుండా, యువత భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ బిల్లుపై చర్చలో ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, ఎన్. ఈశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను పూర్తిగా తొలగించి, ఎటువంటి తప్పులు లేని పారదర్శకమైన జాబితాను రూపొందించాలని వారు కోరారు. సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి, వీటిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పక్కాగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2026 పాస్ అయినట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.

