NationalNews

అక్టోబర్ 1 నుంచి 5 జీ సేవలు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

అక్టోబర్ 1న జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో 5G సేవలను ప్రారంభిస్తారని ప్రభుత్వ జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ట్వీట్ చేసింది. ఈ ఘడియలు ఇండియాలో 5జీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ & కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళుతుందని అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరగనుంది. ఆసియాలో అతిపెద్ద టెలికాం, మీడియా,టెక్నాలజీ ఫోరమ్ అని చెప్పుకునే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నాయ్.

తక్కువ వ్యవధిలో దేశంలో 5G టెలికాం సేవలను 80 శాతం కవరేజీని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గత వారం చెప్పారు. గత బుధవారం దేశ రాజధానిలో జరిగిన ఒక పరిశ్రమ ఈవెంట్‌ను ఉద్దేశించి వైష్ణవ్ మాట్లాడుతూ, 5G అందుబాటులోకి వచ్చాక 40 నుండి 50 శాతం కవరేజీని చేరుకోవడానికి పలు దేశాలకు ఏళ్ల తరబడి పట్టిందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇండియాలో చాలా తక్కువ సమయంలోనే 80 శాతం కవరేజీని లక్ష్యంగా చేరుకుంటామని ఆయన తెలిపారు. 5జీ టెక్నాలజీ భారత్‌కు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2023- 2040 మధ్యకాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థకు $455 బిలియన్ డాలర్లు అంటే సుమారుగా 37 లక్షల కోట్ల మేర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కారణమవుతుందని భావిస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ ఇండస్ట్రీ ఈ అంచనా వేసింది.

2030 నాటికి భారతదేశంలోని మొత్తం కనెక్షన్‌లలో 5G వాటా మూడో వంతు కంటే ఎక్కువగా ఉంటుంది. 2G, 3G వాటా 10 శాతాని తగ్గిపోతుందని GSMA గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ నివేదికలో పేర్కొంది. 79 శాతం ప్రజలు ప్రస్తుతం ఇండియాలో 4 జీ సేవలు పొందుతున్నారు. వీరందరూ 5Gకి మారడానికి సిద్ధంగా ఉన్న సబ్‌స్క్రైబర్ బేస్‌ని ఇది సూచిస్తుంది. 5జీకి సర్వీసులు మార్చుకోవడం వల్ల మేనిఫ్యాక్చరింగ్ రంగం 20 శాతం, రిటైల్ ఇండస్ట్రీ 12 శాతం, వ్యవసాయరంగం 11 శాతం మేర లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.