సీఈసీ నియామకంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకంపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలో ప్రధాని మోదీ, అమిత్‌షాలకు తమ అభ్యంతరాలు ముందే అందించామని పేర్కొన్నారు. అర్థరాత్రి వేళ నూతన సీఈసీని ఎంపిక చేశారని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టులో రెండు రోజుల్లో విచారణ జరగనుంది. ఈ సమయంలో ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ సీఈసీగా జ్ఞానేశ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషి పేర్లను సూచించింది. అయితే కొత్త చట్టం ప్రకారం సీఈసీని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ పూర్తయ్యేవరకూ కొత్త సీఈసీపై నిర్ణయాన్ని వాయిదా వేయాలని రాహుల్ గాంధీ సూచించారు. అయితే ఈ లోగానే ప్రధాని, అమిత్‌షా ఈ పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు.