దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి
సింగరేణి టెండర్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా నిజాయితీ ఉంటే, సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు.తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చీటికి మాటికి సిట్ వేసే సీఎం, ఈ బొగ్గు స్కామ్‌పై సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని , బీజేపీతో రేవంత్‌కు చీకటి ఒప్పందం లేకపోతే కిషన్ రెడ్డి కూడా దీనిపై నోరు విప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సింగరేణికి రెగ్యులర్ సీఎండీని నియమించకుండా ఇంచార్జీలతో అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ మంత్రుల మధ్య ‘వాటాల’ పంచాయతీ నడుస్తోందని, ముఖ్యంగా సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య పెద్ద ఎత్తున వివాదం నడుస్తోందని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కేబినెట్ మంత్రులు దండుపాళ్యం ముఠాలా వ్యవహరిస్తున్నారని, వారి మధ్య వాటాల గొడవ వల్లే ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులవుతున్నారని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని ‘సైట్ విజిట్’ అనే కొత్త విధానాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిందని, దీని ద్వారా కేవలం తమ అనుయాయులకే టెండర్లు దక్కేలా కుట్ర చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. “ఈ విధానం ద్వారా లబ్ది పొందిన మొదటి వ్యక్తి సీఎం బామ్మర్ది సుజన్ రెడ్డి. ఆయనకు చెందిన శోదా కన్స్ట్రక్షన్స్‌కే మొదటి టెండర్ దక్కింది. గతంలో మైనస్ శాతంలో ఉన్న టెండర్లను రద్దు చేసి, ఇప్పుడు ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతానికి తమ అనుయాయులకు కట్టబెడుతూ సింగరేణి ఖజానాను కొల్లగొడుతున్నారు” అని ధ్వజమెత్తారు. నైనీ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క చెప్పడం వారి మధ్య వాటాల పంచాయతీ ఉందని చెప్పడానికి నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ జెండాలను, గద్దెలను కూల్చుతామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలి దుమ్ముదుమ్మవ్వడం ఖాయమని , బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో ఉంది. హౌలా మాటలు మానేసి ఆరు గ్యారెంటీలపై దృష్టి పెట్టాలని హరీశ్ రావు హెచ్చరించారు. కేబినెట్ భేటీలో రైతు బంధు, ఫీజు రియింబర్స్‌మెంట్ గురించి చర్చించకుండా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి ద్రోహం చేసి బయటకు వచ్చిన రేవంత్, ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు జపించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

