యుద్ధంలో ‘గ్రోక్’ ఏఐ వాడాం
పెంటగాన్ సంచలన ప్రకటన
ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో తాము ఎలోన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) టూల్ ‘గ్రోక్’ను వినియోగించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ అత్యాధునిక సాంకేతికతను విజయవంతంగా ఉపయోగించి శత్రువులకు చెందిన దాదాపు 2 వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. మస్క్ నేతృత్వంలోని ‘ఎక్స్ఏఐ’ కంపెనీపై నమోదైన ఒక కోర్టు కేసు విచారణ సందర్భంగా అమెరికా ఈ అంతర్జాతీయ రహస్యాన్ని బహిర్గతం చేసింది. ఎక్స్ఏఐ కంపెనీ తన అతిపెద్ద డేటా సెంటర్ల నిర్వహణ కోసం గ్యాస్ టర్బైన్లను వినియోగిస్తోందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని ఒక పౌరహక్కుల సంస్థ కోర్టులో దావా వేసింది.
ఈ కేసుపై కోర్టులో జరిగిన విచారణలో మస్క్ కంపెనీకి అమెరికా న్యాయశాఖ పూర్తి మద్దతు ప్రకటించింది. దేశ మిలిటరీ ఆపరేషన్లలో ఈ కంపెనీకి చెందిన ఏఐ ఆవిష్కరణలు అత్యంత కీలకంగా పనిచేస్తున్నాయని న్యాయశాఖ సమర్థించింది. అమెరికా జాతీయ భద్రతకు సహకరిస్తున్న అతికొద్ది శక్తిమంతమైన ఏఐ సాంకేతికతల్లో గ్రోక్ ఒకటి అని కొనియాడింది. ఇలాంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన కంపెనీకి వ్యతిరేకంగా దావా వేయడం అంటే అమెరికా జాతీయ, ఆర్థిక, ఇంధన భద్రతకు ముప్పు తీసుకురావడమేనని కోర్టులో స్పష్టం చేసింది.
ఈ విచారణ సందర్భంగా పెంటగాన్ ఏఐ విభాగం అధిపతి కామెరూన్ స్టాన్లీ కోర్టుకు కీలక వాంగ్మూలం ఇచ్చారు. ప్రాజెక్ట్ మావెన్లో భాగంగా గ్రోక్ ఏఐని యుద్ధ ఆపరేషన్లలో విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. మావెన్ స్మార్ట్ వ్యవస్థ ఆధారంగా ఇటీవల ఇరాన్లో కేవలం 96 గంటల వ్యవధిలోనే 2,000 లక్ష్యాలపై 2,000 ఆయుధాలతో విరుచుకుపడి వాటిని పూర్తిగా ధ్వంసం చేశామని, గ్రోక్ అద్భుతమైన సమర్థత వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ మోడల్‌ను వాడినప్పటికీ, నిఘా విభేదాల వల్ల ట్రంప్ సర్కారు వారితో కాంట్రాక్ట్ రద్దు చేసుకుని ఎక్స్ఏఐ సంస్థతో చేతులు కలిపినట్లు ఆయన స్పష్టం చేశారు.

