నగరంలో క్యాసినో కలకలం – 8చోట్ల ఈడీ సోదాలు
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలనే సామెతలాగ ఉంది హైదరాబాద్‌కు చెందిన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిల వ్యవహారం. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా కొంతమంది చట్టవిరుద్దమైన చర్యలకు పాల్పడుతున్నారు. ప్రవీణ్, మాధవ్‌రెడ్డిలు శ్రీలంకకు పలువురిని తీసుకుని వెళ్లి క్యాసినో ఆడించేవారు. ఇప్పుడు శ్రీలంక సంక్షోభంలో ఉండడంతో అక్కడి నుండి మకాం మార్చి, నేపాల్, యూపీ సరిహద్దులో కూడా క్యాసినో సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ వ్యవహారాలు నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. క్యాసినో ఆడేవారు వారం రోజుల పాటు అక్కడే ఉండేలా కూడా ఏర్పాట్లు చేసేవారు. ఈ డబ్బంతా హవాలా మార్గంలో శ్రీలంకకు తరలించారని ఈడీ అధికారులు ధ్రువీకరించారు. తాజాగా వారి ఇళ్లపై , కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రవీణ్, మాధవ్‌రెడ్డితో పాటు ఏజెంట్ల ఇళ్లపై కూడా ఒకే సమయంలో 8 చోట్ల దాడులు చేశారు. వీరు గుంటూరు, హైదరాబాద్, నేపాల్‌లతో పాటు, విశాఖపట్నం, విజయవాడల నుండి కూడా కొందరిని ప్రవీణ్, మాధవ్‌రెడ్డి తీసుకెళ్లారని సమాచారం. వీరు క్యాసినో ఆడేందుకు ఒక్కొక్కరి నుంచీ దాదాపు 3 లక్షల వరకూ వసూలు చేసినట్లు గమనించారు పోలీసులు. హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్‌లో చికోటి ప్రవీణ్ , బోయినపల్లిలో ఉంటున్న మాధవరెడ్డి ఇళ్లపై దాడి చేసారు. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.