లేఆఫ్స్‌కు ఏఐ కారణం కాదు ! ఎన్విడియా సీఈఓ
టెక్ ప్రపంచంలో కొంతకాలంగా సాగుతున్న లేఆఫ్స్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజం, ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీలు తమ సొంత వైఫల్యాలను, ఉద్యోగాల తొలగింపులను కప్పిపుచ్చుకోవడానికి ‘ఏఐ సాంకేతికత’ను ఒక సాకుగా చూపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టెక్ ఎగ్జిక్యూటివ్‌ల తీరుపై ఆయన మండిపడ్డారు. జెన్సన్ హువాంగ్ టెక్ కంపెనీల ధోరణిని ఎండగడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అసమర్థతను దాచడానికే కొంతమంది టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ‘ఏఐ’ పేరు వాడుకుంటున్నారని, ఇది వారి సోమరితనం అని దుయ్యబట్టారు. ఏఐ అనేది గత ఆరు నెలలుగా మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తూ కంపెనీలకు ఉపయోగకరంగా మారింది. మరి అలాంటప్పుడు రెండేళ్ల క్రితమే ఉద్యోగులను తొలగించిన కంపెనీలు, దానికి ఏఐ కారణమని ఎలా చెబుతాయని ఆయన ప్రశ్నించారు. కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికి ఉన్న అసలైన అంతర్గత కారణాలను దాచిపెట్టి, కేవలం చర్చనీయాంశంగా మార్చడానికి ఏఐని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఒకవైపు ఏఐ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతూనే.. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మానవ కార్మికులను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుందేమోనన్న ఆందోళనలు ఉద్యోగుల్లో పెరుగుతున్నాయి. “మనం అనవసరంగా ప్రజలను భయపెడుతున్నాం, ఇది చాలా బాధ్యతారాహిత్యం. కార్పొరేట్ నాయకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అని ఆయన హితవు చెప్పారు.

