నేడు ఢిల్లీకి సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు
◆జీ 20 సదస్సు పై నేడు అఖిలపక్షం భేటీ
◆ 40 పార్టీల అధినేతలకు కేంద్రం ఆహ్వానం
జీ20 సదస్సు నిర్వహణలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు లు ఒకే వేదికపై భేటీ కాబోతున్నారు. 2023లో జీ20 సదస్సును నిర్వహించే అవకాశం భారతదేశం దక్కించుకోవడంతో దానికి ఎజెండాను ఖరారు చేయటానికి దేశంలోని అన్ని పార్టీల నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. మోడీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో సీఎం జగన్ తో సహా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ సమావేశానికి రావాలని గతంలోనే ముఖ్యమంత్రికి ఆహ్వానం వచ్చినప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుండటం ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ఉండటంతో సీఎం వై ఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లే విషయం ఆదివారం వరకు ఖరారు కాలేదు. అయితే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఆదివారం ప్రత్యేకంగా ఫోన్ చేసి జీ20 సమావేశానికి తప్పనిసరిగా రావాలని ఆహ్వానించడంతో వైఎస్ జగన్ ముందుగా ఖరారైన షెడ్యూల్ సర్దుబాటు చేసుకుని ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లి సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే సమావేశంలో వైయస్ జగన్ పాల్గొననున్నారు. ఓకే వేదికపై అధికార ప్రతిపక్ష నాయకులు పాల్గొననుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
