వైసీపీ గెలవదు. వ్యతిరేక ఓటు చీలనివ్వను-పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవట్లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైసీపీ అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మీదంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. బీజేపీ, టీడీపీకు అమ్ముడుపోయే ఖర్మ తనకు పట్టలేదన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ సత్తెనపల్లిలో కౌలురైతు భరోసా యాత్రలో పాల్గొన్నారు. ఏపీలో వైసీపీ నాయకులు చేసే దోపిడి ఎంతని పవన్ ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరకు రావడంతో అవినీతికి వైసీపీ హాలీడే ప్రకటించిందని ఎద్దేవా చేశారు. వీకెండ్ పొలిటీషియన్ అంటూ విమర్శిస్తున్నారని… కాపు సామాజికవర్గం నేతలతో తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. నేనెలా తిరుగుతానోనని వైసీపీ గాడిదలు మొరుగుతున్నాయన్నారు.
వారానికి ఒక్కసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారన్న పవన్… తాతలు సంపాదించిన వేల కోట్ల ఆస్తులు తనవద్దలేవన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో రైతులకు సాయం చేస్తున్నానన్నారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అవినీతి చేస్తున్నారంటూ మంత్రి అంబటి రాంబాబుపై పవన్ విరుచుకుపడ్డారు. కాపుల గుండెల్లో అంబటి కుంపటి అన్నారు. పోలవరం పూర్తి చేయలేని మంత్రి… ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ముల నుంచి కమిషన్లు కొట్టేసే రకం తాము కాదన్నారు. వైసీపీ తీరు వల్లే రోడ్ల మీదకు వచ్చి పోరాడాల్సి వస్తోందన్నారు. అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేస్తానన్నారు పవన్. ఏపీలో రైతులు సంతోషంగా లేరని… రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదన్నారు.

