విశాఖ రాజధాని కోసం వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా
జగన్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమరూపం దాలుస్తోంది. విశాఖ పట్నంలో రాజకీయేతర జేఏసీ సైతం ఏర్పడింది. జేఏసీ చైర్మన్‌గా మాజీ వైస్ చాన్స్‌లర్ హనుమంతి లజపతిరాయ్, కన్వీనర్‌గా దేముడు మాస్టార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో అనకాపల్లి వైసీపీ అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ఉద్యమంలోకి దూకుతున్నట్లు ప్రకటించారు. అవసరమైతే తాను కూడా రాజీనామా చేస్తానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.

అచ్చెన్నాయుడిపై పోటీకి సై..
విశాఖను రాజధాని చేయాలంటూ ఉత్తరాంధ్రలో ఉద్యమాన్ని ఉరికిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన వేలాది మందితో భారీ ర్యాలీకి సైతం ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ నాన్ పొలిటికల్ జేఏసీకి వైసీపీ మద్దతు ప్రకటించింది. తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే చేసిన రాజీనామా పత్రాన్ని జేఏసీ నేతలకు అందిస్తున్నానని ధర్మశ్రీ చెప్పారు. విశాఖ రాజధానికి మద్దతుగా వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దమ్ముంటే విశాఖ రాజధానికి వ్యతిరేకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు.

విశాఖలో అడుగుపెట్టనున్న అమరావతి రైతుల పాదయాత్ర..
అధికార వికేంద్రీకరణ జరగాలంటూ మండల, గ్రామ స్థాయిలోనూ జేఏసీ కమిటీలు వేసి ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్తామని జేఏసీ నాయకులు ప్రకటించారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర విశాఖలో అడుగు పెట్టనున్న తరుణంలో విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ ఏర్పడటంతో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. అమరావతి రైతులను అడ్డుకునేందుకే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల పేరుతో డ్రామాలాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.