తెలంగాణ సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్‌తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటుతో పాటు ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ జూడాలకు హామీ ఇచ్చారు.