లెక్కల మాష్టారి లెక్కలు సఫలమవుతాయా?
ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నాయకులలో దాడి వీరభద్రరావు కూడా ఒకరు. ఆయన లెక్కల మాష్టారుగా పనిచేసినప్పటికీ ఆయన లెక్క ఎప్పుడూ తప్పుతూనే ఉంది. మొదట ఆయన టీడీపీలోనే ఉండేవారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో టిడిపి ప్రభంజనం ఉంటుందని దాడి గుర్తించలేకపోయారు. దాంతో గెలవబోతున్న టీడీపీని వీడి ఓడిపోబోయే వైసీపీలో చేరి కుమారుడు దాడి రత్నాకర్‌కు విశాఖ టికెట్ తెచ్చుకోగలిగారు. కానీ రత్నాకర్ ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో ఆయనను ఎవరూ పట్టించుకోకపోవడంతో రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. మళ్ళీ టిడిపి గూటికి వద్దామనుకొంటే స్థానిక టిడిపి నేతలు గేట్లు తెరవలేదు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తలుపు తడితే లోపలకు రానిచ్చారు. కానీ సీట్ ఇవ్వలేదు. జగన్ కనీసం పట్టించుకోలేదు. అయినా ఇంతకాలం దాడి చాలా ఓపికగా ఎదురుచూశారు.

తాజాగా సిఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను అటూ ఇటూ మార్చుతూ, కొందరిని పక్కన పెడుతూ వైసీపీ నేతలకి టికెట్ల కేటాయింపులు జరుపుతుండటంతో తనకు సీటు కేటాయిస్తారేమోనని దాడి చాలా ఆతృతగా ఎదురుచూశారు. కానీ ఆ జాబితాలలో ఎక్కడా ఆయన పేరులేకపోవడంతో తీవ్ర నిరాశతో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తన రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డికి, ఎంపీ విజయ సాయిరెడ్డికి కూడా పంపారు. కానీ ఎవరూ ఆయన లేఖను పట్టించుకోలేదు. ఈసారి టిడిపి, జనసేనలకు సానుకూల వాతావరణం నెలకొని ఉండటంతో దాడి వీరభద్రరావు టికెట్ సంపాదించుకొని గెలవలగలిగితే మళ్ళీ ఆయన దశ తిరగొచ్చు. కానీ ఆయన కోసం విశాఖ నుంచి పోటీ చేయాలనుకొంటున్న నేతలని పక్కనబెడతారా అన్నది చూడాల్సి ఉంది.
