కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతిస్తుందా?
తమ వర్గానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ పవన్ కల్యాణ్ అని భావిస్తున్న పాతకాపులు ఇప్పుడు, మొత్తం పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల, తెలంగాణలో తాము బీఆర్ఎస్ పార్టీతో సఖ్యతగా ఉంటూ సానుకూల ఫలితాలు సాధిస్తున్నమన్న భావనతో ఉన్న వారికి ఇప్పుడు చిక్కొచ్చిపడింది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో అన్ని రకాల కాపు ఓట్లు సుమారుగా 60-70 వేల వరకు ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కమ్మ ఓట్లు సైతం 30-35 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బరిలో నిలుచుండటంతో… కాపులంతా వన్ సైడ్ గా ఓటేస్తారా లేదంటే బీఆర్ఎస్ వైపు చూస్తారా అన్నది చూడాల్సి ఉంది. కాపులు తమ కులం నుంచి పోటీ చేస్తున్న ప్రేమ్ కుమార్‌ను కాదని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అనుమానమే. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి భావిస్తున్న కమ్మ ఓటర్లు మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారన్నది చూడాలి. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో నాయకుడిగా చలామణి అయిన… బండి రమేష్.. కాంగ్రెస్ పార్టీ పాపులార్టీని నమ్ముకొని మాత్రమే రాజకీయం చేయాల్సిన పరిస్థితి. కమ్మ, కాపు వర్గాలతో మొదట్నుంచి సఖ్యత ప్రదర్శిస్తున్న మాధవరం కృష్ణారావుకు ఇప్పుడు అసలు సిన్మా కన్పిస్తోంది. కులం ఓట్లను కుమ్మరిస్తాయని, మా వాడు కాబట్టే ఓటేశామన్న భావన తగ్గుతున్న నేపథ్యంలో ఈసారి గ్రేటర్ హైదరాబాద్ సాక్షిగా జరుగుతున్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి రాజకీయం కేవలం తెలంగాణ రాజకీయాలనే కాదు… ఏపీ రాజకీయాలను అటు ప్రభావితం చేయొచ్చు. టీడీపీ-జనసేన పొత్తుపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏపీలో తమకు కలిసి పనిచేస్తున్న జనసేనానికి మద్దతుగా ఆ పార్టీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతివ్వాలని టీడీపీ కోరితే రాజకీయం కొత్త పుంతలు తొక్కడం ఖాయం.