వైకుంఠఏకాదశినాడు ‘ఉత్తర ద్వార దర్శనం’ ఎందుకు ముఖ్యమంటే…
ప్రతీ విష్ణు భక్తుడు పరమ భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతం ముక్కోటి ఏకాదశి వ్రతం. నేటి పుణ్యతిథినాడు ముక్కోటి దేవతలు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తుంటారు. దీనినే వైకుంఠఏకాదశి అంటారు. ఈనాడు వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం నుండి స్వామివారి దర్శనం చేసుకోవాలని తహతహలాడుతుంటారు భక్తులు. నేడు డిసెంబర్ 23 వైకుంఠఏకాదశి కావడంతో కలియుగ వైకుంఠమైన తిరుమలకు భక్తకోటి పోటెత్తారు. ఆ ఏడుకొండల స్వామిని ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకోవాలని క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. లక్షల కొద్దీ వచ్చిన భక్తులకు స్వామి దర్శనం కల్పించడం టిటిడికి అసాధ్యంగా మారింది. అందుకే ఈ దర్శనాన్ని పది రోజుల పాటు కల్పిస్తున్నారు.

ఉత్తర ద్వార దర్శనం పురాణాల ప్రకారం చాలా ముఖ్యమైంది.. ఎందుకంటే శ్రీవైకుంఠ మహానగరం, నిత్య విభూతి, పరమ పదము, పరమ ధామము, పరమ వ్యోమ అనే పేర్లతో కీర్తించబడుతుంది. వైకుంఠము అనగా ఎటువంటి దివ్య శక్తులకు కూడా లొంగనిది, తన ప్రాభవాన్ని తగ్గించగల, తప్పించగల ఏ శక్తి దాని ముందర లేవు. చాతుర్మాసంలో యోగనిద్ర పొందిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి నాడు నిద్రనుండి మేల్కొని ఉత్తర ద్వారం గుండా బయటకు వస్తాడని, దీనితో ఉత్తర ద్వారం నుండి వచ్చే భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి. అందుకే ఉపవాస దీక్షతో దేవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి చూస్తారు భక్తులు. భగవంతుడిని సేవించడం అనగా కైంకర్యం చేయడం ఉత్తర ద్వారం.

ఈ ధనుర్మాసంలో ఆండాళ్లమ్మ అంటే గోదాదేవి తిరుప్పావైలో ‘ఉనక్కే నామ్ ఆట్ చెయ్ వోమ్’ అని పలికింది. అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చేయాలి అని కోరింది. అలాగే ‘మత్తనమ్ కామంగళ్ మాత్తు’ అని పలికింది అనగా ఇంతకంటే వేరే కోరికలు మాకు వద్దు అని అర్థం. ఆండాళ్లమ్మ వైకుంఠాన్ని కోరలేదు, స్వామి దర్శనాన్ని కోరలేదు, స్వామి స్తుతిని కోరలేదు, స్వామి కైంకర్యాన్ని కోరింది. చివరికి కైంకర్య భక్తితో స్వామివారినే పరిణయమాడింది. శ్రీరామచంద్రమూర్తి మహా భక్తుడైన హనుమంతుడు కూడా ఇదే కోరుకున్నాడు. అందుకే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుంఠం వద్దు నీ సేవ కావాలని కోరుకున్నాడు. భగవంతుని లోకంలో ఉండడం, భగవంతుని దగ్గర ఉండడం, భగవంతుని చూడడం, భగవంతుని స్తుతించడం ఇవేమి కోరవలసినవి కావు. పరమాత్మ ఏకాంత సేవ చేయాలి అని గాఢంగా తపించగలగడమే ఉత్తర ద్వార దర్శనం యెక్క ఉద్దేశం.

