మంగళగిరిపై ఎందుకంత దృష్టి?
నేతలంతా అధికారం పార్టీలోకి?
మరి ప్రజలు ఎవరి వైపు?
మరోసారి బరిలో లోకేశ్, ఆర్కే
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మంగళగిరిపై దృష్టి పెట్టింది. 2019 హవాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఓటమి చవి చూసిన మంగళగిరిలో ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా లేవని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని నియోజకవర్గ ముఖ్యనేతలు స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డితో విభేదించి అంటీముట్టనట్లు ఉండటంతో ఈసారి గెలుపు కష్టమని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును పార్టీలో చేర్చుకోకుండానే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమలను, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 12 ఓట్లతో ఓటమి చెందిన గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రధాన సామాజికవర్గమైన పద్మశాలీల నుండి ముగ్గురు ప్రధాన నాయకులను అధికార పార్టీలో చేర్చుకోవడంతో రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇంత మంది నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో నారా లోకేశ్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండటం, తన ప్రత్యేక బృందాలతో గ్రామగ్రామాన ప్రజల సమస్యలను తెలుసుకొని పలు పోరాటాలు నిర్వహించడమే గాక, ప్రజలందరికీ అందుబాటులో ఉండటంతో టీడీపీ బలం పుంజుకుంది. ఇటీవల అధికార పార్టీ మూడు సర్వేలు చేయించగా… అన్నీ సర్వేల్లో 10 నుండి 15 శాతం తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనబర్చడంతో ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేశ్‌ను ఓడించాలనే పథకం వైసీపీ రచించినట్టు తెలుస్తోంది. రాజధాని ప్రభావం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండటం, అమరావతి రాజధానిని వ్యతిరేకించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి అభ్యర్థిగా నిలబెట్టవలసిన పరిస్థితి రావడంతో వైఎస్ జగన్ మంగళగిరితోపాటు, రాజధాని ప్రభావిత నియోజకవర్గాల్లో ఇప్పట్నుంచే అప్రమత్తమయ్యారు. ఇటీవల తాడికొండలో తమ పార్టీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఉండగానే… మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అదనపు సమన్వయకర్తగా నియమించడం, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని సూచనప్రాయంగా ఓ నిర్ణయానికి రావడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల కాండ్రు కమల పార్టీలో చేరిన పిదప మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. అక్కడ్నుంచే పోటీ చేసి గెలిచితీరతానని… నారా లోకేశ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీలో చెప్పుకోదగ్గ అంతర్గత కుమ్ములాటలు లేకపోవడం, వైఎస్సార్ కాంగ్రెస్‌లోని ముఖ్యనాయకులతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి పొసగకపోవడం, అనాదిగా బీసీలకు సీటు కేటాయించే నియోజకవర్గం కావడంతో ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డిని మారుస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన నారా లోకేశ్ ఉండటంతో ఇక బీసీ నినాదానికి తెరపడ్డట్లేనని భావించిన వైసీపీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పోటీచేయించాలనే బలమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదనే భావన కూడా ప్రజల్లో బలంగా ఉంది. ఈ ప్రతికూలతలన్నింటినీ అధిగమించాలంటే నియోజకవర్గంలోని నాయకులందరినీ తమ పార్టీలోకి చేర్చుకోవడమే మార్గమని వైసీపీ భావిస్తోంది. భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం చేరికలపై కూడా వైసీపీ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఐతే ఇవేమీ పట్టించుకోకుండా నారా లోకేశ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి పలు ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.


