మంథనిలో మార్పు సంకేతం
కరీంనగర్ జిల్లాలో మంథని నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచి ఓడిన పుట్టా మధుకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి అవకాశం కల్పించింది. మంథని నియోజకవర్గంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాలుగు సార్లు విజయం సాధించారు. ఆయన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. గతంలో వైఎస్సార్ , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో కీలకశాఖలకు మంత్రిగా పనిచేశారు శ్రీధర్ బాబు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఐనా 2014లో ఓటమి పాలయ్యారు. తిరిగి 2018లో గెలుపొందారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మంథనిలో మరోసారి జెండా ఎగురేయాలని శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నప్పటికీ.. పుట్టా మధు ఈసారి ఆయనకు ఝలక్ ఇస్తానంటున్నారు. 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఈసారి గెలుపు పక్కా అంటున్నారు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి సునీల్ రెడ్డి సైతం పోటీ గట్టి పోటీ ఇస్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు.

మంథనిలో పోలింగ్ బూత్‌ల సంఖ్య 288. పురుష ఓటర్లు 1,13,828, మహిళా ఓటర్లు 1,16,458, ట్రాన్స్ జెండర్లు 20 మంది కాగా, మొత్తం ఓటర్లు 2,30,306 ఉన్నారు. మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజికవర్గం గణనీయంగా ఉండగా మాదిగలు, పద్మశాలీలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. మున్నూరు కాపు ఓటర్లు పదమూడున్నర శాతం ఉండగా, మాదిగలు 12 శాతం, పద్మశాలీలు 12 శాతం వరకు ఉన్నారు. ఇతర బీసీ వర్గాల ఓటర్లు పదిన్నర శాతం వరకు ఉన్నారు. గౌడ, మాల సామాజికవర్గాల ఓటర్లు సుమారుగా 9 శాతానికి అటూఇటూగా ఉన్నారు. లంబాడా ఐదున్నర శాతం, తెనుగు-ముదిరాజ్ 5 శాతం, రెడ్డి సామాజికవర్గం 4 శాతం, గొల్ల-కురుమలు 4 శాతం ఉండగా, ఇతర ఓటర్లు 16 శాతం వరకు ఉన్నారు.