ఎన్టీఆర్ ఎవరు?
ఎన్టీఆర్ మే 28, 1923 నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు. జనవరి 18 – 1996న మరణించారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, ఎన్.టి.ఆర్, అన్నగారు తదితర ఇతర పేర్లతో పేరు సంపాదించుకున్నారు. సినీ నటుడిగా, దర్శకుడుగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడుగా, రంగస్థల నటుడుగా ఎన్టీఆర్ రాణించారు. నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావు గా మారింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపల్ హైస్కూలులో సాగింది. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరారు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి ‘ససేమిరా’ అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు “మీసాల నాగమ్మ” అనే పేరు తగిలించారు. సాయంత్రం 3.23నిమిషాలకు అనగా 1942 మే 2 నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు.

వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాత కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా లభించింది. సుభాష్ చంద్రబోసు విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చాడు. రామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు. రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషన్ పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.