Home Page SliderTelangana

బీసీలకు మీరేం చేశారు కేసీఆర్!

బీసీల సీట్లు బీసీలకు ఇచ్చేయండి కేసీఆర్.. ఎందుకీ లొల్లి.. అవును తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు బూమ్‌రాంగ్ అవుతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏరు దాటేదాక ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న..ఇది కేసీఆర్ నైజం.. అని రుజవవుతోంది. కోదాడలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌ను గెలిపించాలంటూ చేసిన ప్రచారం ఇప్పుడు ఆ పార్టీ తీరును ప్రశ్నిస్తోంది. సీఎం కేసీఆర్ తానే నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించేవారుండరన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. అది రాజకీయమైనా, ప్రభుత్వ పథకాలైనా, విధాన నిర్ణయాలైనా.. ఎవరూ తనను ప్రశ్నించరాదని ఆయన భావిస్తారు. తెలంగాణలో బీసీలకు అతి తక్కువ సీట్లిచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీసీల కోసం అది చేస్తాం, ఇది చేస్తామంటూ కల్లబొల్లికబుర్లు చెబుతోంది.

వచ్చే ఎన్నికల్లో బీసీలు ఎట్లా ఓటేస్తారన్నదానిపై తర్జనభర్జన నెలకొన్న దరిమిలా కేసీఆర్ తీరు అనుమానస్పదంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో 60 శాతమున్న బీసీలు ఎందుకు ఓడాలని ఆయన తాజాగా ప్రశ్నించారు. 50 శాతం, 60 శాతమని నర్కుడు కాదని.. చైతన్యం చూపాలని ప్రశ్నించారు. కోదాడలో ఎప్పుడూ బీసీలకు అవకాశం రాలేదని.. తనే తొలిసారి మల్లయ్య యాదవ్‌కు టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. మల్లయ్య యాదవ్ ఎన్నికల్లో గెల్వడని కొందరు చెప్పారని.. కానీ నేను మాత్రం బీసీలకు అన్యాయం చేయరాదని టికెట్ ఇచ్చానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మల్లయ్య యాదవ్ ను ఓడించేందుకు బలిసినోళ్లందరూ కుట్రలు పన్నుతున్నారని 60 శాతమున్న బీసీలు ఎందుకు ఓడాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఐతే కేసీఆర్ చెప్పడం ఒకలా ఉంటుంది. కానీ కేసీఆర్ చేసేది మరోలా ఉంటుంది.

తాజాగా అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో కేసీఆర్ బీసీలకు ఇచ్చిన సీట్లు 20 శాతం మాత్రమే. కేసీఆర్ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేశాడని, బీసీ సంఘాలు గగ్గోలుపెడుతున్నాయ్. బీసీలకు కేవలం 23 టికెట్లు మత్రమే ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన టికెట్ల కంటే ఈసారి తక్కువ ఇచ్చారని విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ పట్టించుకున్న నాధుడే లేడు. 117 సీట్లలో 67 మంది అగ్రవర్ణాలకే టికెట్లు కేటాయించారని వారు ఆరోపిస్తున్నారు. బీసీలంటే కేవలం రెండు భవనాలు కట్టిస్తే చాలని కేసీఆర్ అనుకుంటున్నారని… రాజకీయంగా పదవులు లభించినప్పుడే ఆత్మగౌరవం సాధ్యమవుతుందని కేసీఆర్ భావించడం లేదా అంటూ వారు మండిపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లలో ఒక్కరికి కూడా బీఆర్ఎస్ సీటు ఇవ్వకపోవడం దారుణమని ఆ సామాజికవర్గం మేధావులు మండిపడుతున్నారు.