చంద్రబాబు 100 రోజుల పాటు ఏం చేశారు?.. షర్మిల
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని వస్తున్న వివాదంపై సీబీఐ ఎంక్వైరీ జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇంతటి ఘోరమైన తప్పు జరిగిందని చంద్రబాబు విమర్శించినప్పుడు 100 రోజుల పాటు చంద్రబాబు దీనిపై యాక్షన్ తీసుకోకుండా ఏం చేశారని ప్రశ్నించారు. అంటే కూటమి ప్రభుత్వం పరిపాలన విషయంలో ప్రజలేమనుకుంటున్నారో అనేదానికి 100 రోజుల సమయం తీసుకుని, దానిని కప్పిపుచ్చడానికి ఇలాంటి పుకార్లు పుట్టించారా? అంటూ మండిపడ్డారు. ఇలాంటి విషయంలో రాజకీయం చేయడం మంచి పద్దతి కాదని, కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు కేవలం వైసీపీ పార్టీ పరువు తీసేందుకే చేసినట్లుయితే అంతకంటే పాపం ఇంకోటి ఉండదన్నారు. ఎలాంటి ఆధారం చూపకుండా వైసీపీ పాలనలో నెయ్యిలో కల్తీ జరిగిందని ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు దీనిపై లేఖ రాస్తామని పేర్కొన్నారు.