NationalNews

గుజరాత్‌ను గెలిచేస్తాం.. నెల రోజుల్లో సీన్ రివర్స్ అవ్వుద్ది…

గుజరాత్‌లో గెలిచి పీఠాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ లో జరుగుతున్న ఎన్నికల్లో తాము ఇప్పటికే నెంబర్ 2 పొజిషన్లో ఉన్నామన్న కేజ్రీవాల్.. నెంబర్ వన్ కోసం పనిచేస్తున్నామన్నారు. గుజరాత్ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలిగితే, దర్యాప్తులో చిక్కుకున్న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను విడిచిపెడతామని బీజేపీ ఆఫర్ చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో ఏకకాలంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడం ద్వారా కేజ్రీవాల్‌ను కార్నర్ చేసినట్లు తాను అనుకోవడం లేదన్నారు. బీజేపీకి భయం పట్టుకుందని.. రెండు చోట్లా గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు. గుజరాత్, ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో తాము ఓడిపోతామని బీజేపీ భయపడుతోందన్నారు. అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి జరిగేలా చూసుకున్నారని విమర్శించారు.

ఆప్‌ని వీడి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండాలన్న వారి ప్రతిపాదనను మనీష్ సిసోడియా తిరస్కరించారన్నారు. గుజరాత్‌ను వదిలి అక్కడ పోటీ చేయకుంటే, సత్యేందర్ జైన్, సిసోడియా ఇద్దరినీ విడిచిపెడతామని అన్ని ఆరోపణలను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. ఢిల్లీలో ఇప్పుడు రద్దు చేయబడిన మద్యం విక్రయాల విధానంపై సిసోడియాపై… ప్రాక్సీ ‘హవాలా’ లావాదేవీల గురించి జైన్‌పై దాఖలైన కేసులు కల్పితమని అన్నారు.

గుజరాత్‌లో ఆప్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, 182 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఐదు కంటే తక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం లాభదాయకమైన సంబంధంలో భాగస్వాములయ్యాయని ఆరోపించిన ఆయన, ఆప్ ఉప్పెనను అరికట్టేందుకు అధికార పార్టీ… ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఆర్థికంగా సాయపడుతోందన్నారు. రేసులో ఆప్ ఇప్పటికే నంబర్ 2గా ఉందని, కాంగ్రెస్ కంటే చాలా ముందంజలో ఉందని, వచ్చే నెల రోజుల్లో బీజేపీకి వచ్చే ఓట్లను అధిగమిస్తుందన్నారు.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గద్వీని ప్రకటించింది, మాజీ జర్నలిస్ట్, టీవీ యాంకర్ అయిన ఇసుదన్ గాధ్వి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై AAP సర్వేలో 73 శాతం ఓట్లు సాధించారు. పంజాబ్‌లో జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్‌ను ఎంపిక చేసింది. గత ఏడాదే జూన్‌లో ఇసుదాన్ గాధ్వి ఆప్‌లో చేరారు.